Sri Matsya Mahapuranam-1    Chapters   

శ్రీగురుభ్యో నమః.

శ్రీ మత్స్యమహాపురాణము.

విషయ ప్రవేశిక-ఆవశ్యక వివరణములు.

శ్రీమత్స్యమహాపురాణప్రశస్తి.

పురాణములు భగవదుపాసనమునకు సోపానములు.

సృష్టిలో జరుగు అన్ని పరిణామములకును హేతువులగు వానిలో కాలముకూడ ఒకటి. అది అనంతము. భగవంతుడు విరాడ్రూపమున కాలమునందే ఉండును. అయినను ఆతడు దానికి అతీతుడు. ఈ అనంతుడే ఆది శేషుడు. అతడు సమస్త భూ(విశ్వ) భారమును మోయుచున్నాడు. అనగా విశ్వము కాలమునందే నిలిచియున్నది. శ్రీ మహా విష్ణువు అతని పై శయనించి యుండును. అయినను అతడు అతనికి అతీతుడయి స్వామి అయి ఉండును. శ్రీ విద్యా సంప్రదాయమునందును మూలాధారాది సహస్రారాంత చక్ర సముదాయమున శ్రీదేవి అనంతకాల రూపగానే ఉపాసింపబడుచున్నది. (చూ. సౌందర్యలహరి-శ్లో. 14; ఋగ్వేద 1 మం. 164 సూ.) అజపా గాయత్రీ తత్త్వమును ఇదియే.

పురాణములు ఇట్టి కాల పరిణామములగు ఆయా యుగములయందు జరుగు వృత్తాంతములను తెలుపుచు మానవులయు-తదితర సకల జీవులయు-జీవన స్థితికి ఆవశ్యకములగు సకల ధర్మములను తెలుపుచు సకల వేదవేదాంగ వేదాంతాగమ సారభూతములుగా ఉన్నవి.

ఇంతియ కాదు. పురాణములు పరాత్పరుని దృశ్య ప్రపంచాత్మక రూపమును నమగ్రముగా వివరించును. దీనికే 'విరాడ్రూపము' అని శ్రుతులయందును శాస్త్రములయందును వ్యవహారము. ఈ విరాట్స్వరూపోపాననము పరమాత్ముని ఉపాసించుటకు సాక్షాన్మార్గము అనియు-ఆ విరాట్స్వరూపమును ప్రతిపాదించు వాఙ్మయమును అధ్యయనము చేయకుట శబ్దాత్మక పరబ్రహ్మ తత్త్వమును ఉపాసించుటయే అగుననియు శ్రీమద్భాగవత ద్వితీయ స్కంధము తెలుపు చున్నది. సమస్త వేదాగమ సారములగు పురుషసూ క్తము-రుద్రాధ్యాయము-శ్రీవిష్ణు సహస్ర నామస్తోత్రము-ఈ విరాట్స్వరూపమును ప్రతిపాదించుచు ఉపాసకులకు ముక్తి సాధనములయి నాలుగు ఆశ్రమముల వారిచేతను ఉపాసింపబడుచున్నవి. ఇటువంటి విరాట్తత్త్వమును సరళ మార్గమున తెలుపునవి అగుటచేతను భగవంతుని తత్త్వమును ఆ మహానుభావుని అనంత శక్తి వైశిష్ట్యమును అపార కరుణా పరత్వమును ప్రతిపాదించునవి అగుటచేతను పురాణ సాహితీ పరంపర భగవదుపాసనకు సుఖతరమును సులభతరమును అగు సోపాన పరంపరగాను పరమ పురుషార్థ సాధన సామగ్రీ నిధానములుగాను ఉన్నవి. కనుకనే ఇవి ఆబాలగోపాలము సర్వజనులకును సమాదరణీయములుగా ఉన్నవి.

లోగడ పురాణములకు ఉండు పంచలక్షణములను తెలిసికొనియున్నాము.

వీనియందు ప్రసక్తానుప్రనక్తముగ ధర్మము అర్థము కామము మోక్షము అను నాలుగు పురుషార్థములను మానవులు సాధించుటకును ఇష్టప్రాప్తిని అనిష్ట నివృత్తిని సాధించుటకును కావలసిన యంశములును భగవదవతారములును దేవాసుర సంగ్రామములును ప్రతిపాదింపబడును. దీనికి అనుగుణముగ వీనియందు వర్ణాశ్రమాచార ధర్మములును ప్రతిపాదింపబడును.

వీని సహాయమున మానవులు ధర్మమునకు హాని కలుగకుండ అర్థమును సంపాదించవలయును. ఆ అర్థమును వినియోగించుచు ఇహపరసుఖ విఘాతుకము కాని విషయ సుఖములను అనుభవించవలయును. ఈ విధమున కామ పురుషార్థమును సాధించుచు అదే అర్థముతో ధర్మము ననుసరించి ఇహపర సుఖములను సాధించుకొనవలయును. క్రమముగ ప్రపంచ ప్రవృత్తియందలి గుణదోషములను మానవులు విచారణము చేయుదురు. సంసారమునుండి విరక్తులగుదురు. జనన మరణ ప్రవాహ రూపమగు సంసారపు బంధమునుండి ముక్తినంద వాంఛింతురు. తత్సిద్ధికై వారు భగవంతునుపాసింతురు. తుదకు అట్టి ము క్తియను పరమ పురుషార్థమును సాధింతురు. అనునది పురాణములను మనకు అందజేసిన ఋషుల సత్సంకల్పము.

ప్రపంచమును భవగద్రూపముగనే చూచి అందలి జడచేతన పదార్థములను అన్నింటిని భగవద్విభూతులుగనే భావించి ఉపాసించుట భగవదుపాసనా రూపవిశేషము. ఇందలి ప్రథమ సోపానముగా ఈ ప్రపంచమును దేశాత్మకము గను కాలాత్మకముగను దేశకాలోభయాత్మకముగను ఉపాసించవలయును. సచ్చిదానంద మూర్తియగు పరమాత్ముని ఏతత్సకల జగదంతర్యామిగాను సకల జగద్రూపునిగాను గుర్తించి సర్వమును అతని దివ్య కళామయమునుగా భావించి యుపాసించవలయును.

దీనికి అనుగుణముగానే పురాణములయందు ఱప్పపాటు మొదలుగా కల్ప పరిమాణమువరకు గల కాల వ్యవస్థయు మన్వంతర పరిమాణములును యుగధర్మ ప్రవృత్తులును మన్వంతర భేదములచే లోకప్రవృత్తి విశేషములును చెప్పబడుచున్నవి. ఇది కాలాత్మకమగు భగవద్రూపము.

పురాణములయందు ప్రతిపాదింపబడు భూగోళ వ్యవస్థయంతయు దేశాత్మకమగు భగవద్రూపము.

ఖగోళ వ్యవస్థయంతయు దేశకాలోభయాత్మకమగు భగవద్రూపము.

భగవంతుని ఈమూడు రూపములలో ఉపాసించుటకు పురాణములు సామగ్రి నందజేయుచున్నవి.

ఇది పారమార్థిక దృష్టితో చేయు విచారణము.

ఇది ఎట్లున్నను ఈ విధముగ ప్రపంచమును దేశ-కాల-తదుభయ-రూపముగ తెలిసికొనుటచే ప్రపంచ విషయక మగు పరిజ్ఞానము పెరుగును. దానిచే మానవులకు లౌకిక వ్యవహారజ్ఞానమును అనుభవమును వృద్ధిచెందును.

ఇది పురాణములయందలి కొన్ని ప్రధానాంశముల ప్రయోజనము.

మరియొక యంశము పురాణములలో మానవులను తత్త్వ విచారణోన్ముఖులనుగా చేయునదియు లోకప్రవృత్తిలో కూడ వారి వ్యవహార జ్ఞానమును పెంచి వారిని సన్మార్గ ప్రవృత్తికి కొనిపోవునదియు కలదు. అది దేవాసుర సంగ్రామ వృత్తాంత ప్రతిపాదనము.

ఈ దేవాసుర సంగ్రామ వృత్తాంతములను ఉన్నవి ఉన్నట్లుగ గ్రహించి అసురులను దుష్టులనుగాను దేవతలను ఉత్తములనుగాను భావించి దేవతలయందు భక్తిశ్రద్ధలను పెంచుకొనుటయు సకల దేవతానాధునిగా పరమాత్ము నుపాసించుటయు ఒక పద్ధతి.

ఇంతటితో ఊరకుండక ఈ దేవాసుర సంగ్రామ వృత్తాంతముల వెనుకనున్న తాత్త్వికార్థమును విచారణచేసి గ్రహించుచు వాని మూలమున భగవత్తత్త్వ వాస్తవరూపమును గ్రహించి పరమాత్ము నుపాసించుట మరియొక పద్దతి.

ఇందు మొదటి పద్ధతి సర్వసాధారణముగా ఆస్తికులు అందరును పాటించుచున్నదే; కావున దానిని గూర్చి అంతగా విచారణము చేయవలసిన ఆవశ్యకతలేదు.

రెండవ విధమగు దానిని ఆలోచింతము. ఇందులకై ఆదాహరణముగా వృత్రాసుర కథను తీసికొనవచ్చును. ఇందు ఇంద్రుడు సూర్య ప్రకాశమునకును వృత్రుడు సూర్య ప్రకాశమయు చొరని ప్రదేశములందు ప్రకృతి వశమున ఏర్పడు దోషమునకును ప్రతినిధులనుగా గ్రహించవచ్చును.

ఈవిధమగు 'వృత్రుని' ప్రభావమును మనము ఈనాటికిని కుక్క గొడుగులు క్రుళ్ళిన పదార్థములపై పుట్టెడి సజీవ పదార్థమగు బూజు మొదలగు వానియందు చూచుచునే ఉన్నాము.

ఆకాశమునందు కానవచ్చు నక్షత్రముల సన్ని వేశాదికమును కొన్ని సంఘటనముల సంకేతమునుగా భావన చేసి వానిని కథలుగా పురాణములందు ఇచ్చినవియు కొన్ని కలవు. త్రిపురాసుర సంహారకథ మొదలగు వానిలో అట్టి సంకేతము కలదని కొందరు తలతురు.

ఇట్లు ఆయా యంశములను పురాణములనుండి నయు క్తికముగా విచారణచేసి గ్రహించవచ్చును.

పురాణముల వలన మరియొక ప్రయోజనము మానవులు తమకు జన్మతః సిద్దించిన దోషములను తొలగించుకొని చిత్తమునకు సంస్కారము కలిగించుకొనుట; శాస్త్రమునందు శరీరమునందలి పాంచభౌతికాంశములు మొదలగునవి ఇట్లు తెలుపబడినవి:

విష్ణు ధర్మోత్తర పురాణ ద్వితీయఖండే 115 తమే7ధ్యాయే:

7. ఆకాశజాని స్రోతాంసి తథా శ్రోత్రం వివిక్తతా|

శ్వాసోచ్ఛ్వాసౌ పరిస్పందో వాక్చ సంస్పర్శనం తథా.

8. వాయవీయాని జానీయా త్సర్వాణ్యతాని పండితః|

రూపంచ దర్శనం పక్తిం పిత్త మూష్మాణ మేవ చ.

9. మేధాం వర్ణం బలం ఛాయాం తేజః శౌర్యం తథైవ చ |

సర్వాణ్యతాని జానీయా త్తైజసాని శరీరిణామ్‌.

10. ఆంభసానీహ రసనం స్వేదః క్లేదో వసా తథా|

రసా7సృక్‌ శుక్రమూత్రాణి దేహే ద్రవచయ స్తథా.

11. శైత్యం స్నేహంచ ధర్మజ్ఞ! తథా శ్లేష్మాణ మేవ చ|

పార్థివానీహ జానీహి ఘ్రాణకేశనఖాని చ.

12. అస్థ్నాం సమూహం ధైర్యం చ గౌరవం స్థిరతాం తథా|

మాతృజాని మృదూన్యత్ర త్వక్చ మాంసంచ పార్థివ.

13. హృదయం చ తథా నాభిః స్వేదో మజ్జా యకృ త్తథా|

క్లోమాంతంచ గుదం రామ! ఆమస్యాశయ మేవ చ.

14. పితృజాని స్థిరాణ్యత్ర భూమిజానీహ యాని తు|

స్నాయుశుక్రసిరాశ్చైవ ఆత్మజాని నిబోధమే.

తా. స్రోతస్సులు (వాయువు మొదలగునవి ప్రసరించు కాలువలవంటి అవయవములు) చెవులు-వివిక్తత (ఒక అవయవమును మరియొక అవయవమునుండి వేరుపరచు లక్షణము) ఇవి అన్నియు ఆకాశభూతము వలన కలిగిన లక్షణములు.

గాలిని పీల్చుట-విడుచుట-చలనము-వాక్కు-స్పర్శానుబవము-ఇవి యన్నియు వాయుభూతము వలన లభించిన లక్షణములు.

రూపము-చూచుట - ఆహారము పక్వ(జీర్ణ)మగుట-పిత్తము-వేడిమి - మేధ-దేహవర్ణము-బలము-ఛాయ-తేజము-శౌర్యము-ఇవి యన్నియు తేజోభూతము వలన కలుగు లక్షణములు.

రసనము(రుచినిగ్రహించుయోగ్యత)చెమట-తడి-వస-ద్రవము-రక్తము-శుక్రము-మూత్రము-ఇట్టి ద్రవ్యరాశి యంతయు జలభూతము వలన కలుగు లక్షణములు.

ఘ్రాణంద్రియము (గంధగ్రహణ యోగ్యత) వెండ్రుకలు-గోళ్లు-ఎముకల సమూహము-ధైర్యము-గౌరవము (బరువు)-స్థిరత్వము-ఇవి యన్నియు పృథివీభూతము వలన కలిగిన లక్షణములు.

ఈ చెప్పినవానిలోను-మృదువులగు అంశముల - అనగా -త్వక్‌-మాంసము - హృదయము - నాభి-చెమట-మజ్జ-యకృత్‌-క్లోమము-గుదము-ఆమాశయము-ఇవి మాతృదేహమునుండి లభించినవి.

దృఢాంశములగు పృథివీభూత లక్షణము లన్నియు పితృదేహమునుండి లభించినవి.

స్నాయువులు (నులినరములు)-శుక్రము-సిరలు-ఇవి ఆ దేహికి తన దేహమునుండి లభించినవి.

ఈ విధముగ పంచ భూతముల అనుగ్రహయమున మాతృ పితృదేహ జాతములును స్వదేహమున స్వయంసిద్ధములును అగు ఆయా తత్త్వములను బట్టియే ఆయా మానవుల మానస సంస్కారములు ఉండును. వానియందు ఉండు దోషములను తొలగించుకొనుటకును సల్లక్షణములను మరింత వృద్ధిపరచుకొనుటకును క్రియాయోగము మొదలగు ఉపాసనా విధానములు ఉపయోగించును.

పురాణములయందు ఈ ఉద్దేశముతోనే ఆయా విషయములు ప్రతిపాదింపబడుచున్నవి.

ఇట్లు సకల పురుషార్థ సాధనములగు పురాణములలో శ్రీమత్స్య మమాపురాణపు ప్రాశ స్త్యము ఎన్న దగినది. ఇందు పురాణ లక్షణములన్ని యు సమగ్రముగ నున్నవి. వానికి తోడు జ్ఞానము-భక్తి-శ్రౌతస్మార్త నిత్యనైమిత్తిక కామ్యకర్మాను ష్ఠానోపయోగులగు అనేకాంశములు క్రియాయోగాత్మకమగు ఉపాసనము పరమాత్ముని దేశకాల తదుభయరూపునిగా ఉపాసించుటకు ఆవశ్యకములగు భూగోళ-యుగ-ఖగోళ వ్యవస్థా విషయకాంశములు లోకప్రవృత్తి సాధకములగు రాజ ధర్మాదికము మొదలగునవి చక్కగా తెలుపబడినవి.

శాస్త్రమునకు సంబంధించిన అనేక విషయములందును ఇందు ప్రతిపాదింపబడిన యంశములు వేదమూలకములును ఋషి పరంపరాగతములును అగుటచే సమస్త ధర్మశాస్త్ర నిబంధకారులును భాస్కరరాయాద్యుపాసక పుంగవులును తమ రచనలలో ఆయా సందర్భములందు ఈ మహాపురాణమునందలి వచనములను ప్రమాణములుగా గ్రహించియన్నారు. ఇందు ప్రతిపాదింపబడిన గోత్రప్రవర ఖండమందలి అంశములను ప్రామాణికములుగా సంస్కార కౌస్తుభాది నిబంధకారులు గ్రహించియున్నారు. శ్రీకమలాకరభట్టు తాను రచించిన శాంతి కమలాకర శాంతిరత్నాదులయందు ఈ మత్యపురాణ వచనములను ఆయా సందర్భములలో ఉద్ధరించెను. అతడు వాస్తు పూజా విధానమున గ్రహించిన ఏకాశీతిపద-చతుష్షష్టి పద-వాస్తుమండలములందలి దేవతా వ్యవస్థయంత యు ఈ మత్స్య పురాణము నందలిదే. ఈ విషయమున శ్రీవిష్ణు ధర్మోత్తరమున నేడు లభించు ప్రతులలో గ్రంథభ్రంశమువలననో మరి ఏ హేతువుననో చాల ఆస్తవ్యస్తతలు కనబడుచున్నవి.

ఇందు ఆయా సందర్భములలో ఈయబడిన దేవతా స్తోత్రాదికము తత్త్వ ప్రతిపాదకమగుటతోపాటు ఉపాసనా విషయకమయి యున్నది. శ్రీదేవీ స్థానాష్టోత్తరనామములు- శివనామ త్రశతి-మాతృకా సంఖ్యాక శివనామావళి - శివనామ నవ్తతి - వీరకకృత గౌరీస్తుతీ-సావిత్రీకృతయమస్తుతి ఇందు మిగుల విలక్షణమయినవి.

ఈ పేర్కొనిన అంశములన్నియు పఠితలకు జిజ్ఞాసువులకు ఆందజేయుటకు ఇట యథాశక్తి యత్నము చేయబడినది ఇందుగల మరికొన్ని విలక్షణాంశములు :

1. కాలనేమియను అసురుని నాస్తికతాదృష్టిగల కేవల వైజ్ఞానికులకు ప్రతినిధిగా నిరూపంచుట.

2. అధర్మపూర్ణమగు కలియుగము అయిన తరువాత కేవల ధర్మపూర్ణమగు కృతయుగము వచ్చు విదము తెలుపుటలో ఆధునికులు కొందరు అనుచున్న 'Dialectics' అనబడు ప్రక్రియను నిరూపించుట.

3. బలి చక్రవర్తిని దానవుడను దృష్టితో కాక ఆతని మహత్తను చాల గొప్పగా చూపుటలోని నిష్పాక్షికత.

4. కల్పభేద ప్రతిపాదనములోని యుక్తియుక్తత-మొదలగునవి.

కొన్ని సందేహములకు సమాధానములు ఈ మహా పురాణమునుండి లభించును.

1. కర్ణుడు అంగరాజ పుత్త్రుడును సూత పుత్త్రడును ఎట్లయ్యెను? కర్ణుని తన దగ్గరకు తీసికొనిన సూతుడు వాస్తవముగా ఎవరు?

2. భారతమున ఆదిపర్వమున పేర్కొకనబడిన 'బలి' అను రాజు ఎవరు?

3. శ్రీదేవీ సప్తశతియందలి అనేక సంశయములకు ఇందలి తారకాసుర మధుకై టభ వధకథ సమాధానము ఇచ్చును. అవి అన్నియు వివరించుటకు ఇది సమయము కాదు.

సాంప్రదాయికములగు కొన్ని అంశములు ఇందు విలక్షణముగా విశిష్టముగా వర్ణింపబడినవి :

1. అగ్నివంశ వర్ణనము 2. శ్రాద్ధకల్పము 3. అంధకాసురవధ సందర్భమున శైవ-నారసింహశక్తుల ఆవిర్భావము 4. పాద్మకల్ప వృత్తాంతపు సృష్టి సందర్భములో ప్రతిపాదించిన షోడశ ఋత్విక్కులకును ప్రజాపతి దేహావయవత్వ నిరూపణమునకు శ్రౌత సంప్రదాయమున గల ప్రాముఖ్యము.

కథా ప్రతిపాదమునములో వైలక్షణ్యము-వర్ణనా సౌందర్యముగల తావులు :

1. నరసింహావతారము - ఆనాటికి - ప్రహ్లాదుడు ఐదేండ్ల పసివాడుగా కాక బలి-తత్పుత్త్రాదులు కూడ చాల వయస్సు కలవారుగా చెప్పుట-ఏతత్ప్రసంగమందలి వర్ణనములు; 2. పురూరవసుడను మద్రరాజు దర్శించిన ఇరావతీ సద్యాది వర్ణనములు; 3. వీరకబాలక్రీడలు మొదలగునవి.

ఈ పురాణమున అనుసరింపబడిన విషయ ప్రతిపాదన ప్రణాళిక ప్రత్యేకముగ అధ్యయనము చేయవలసిన యంశము. దీనియందు ప్రతిపాద్యాంశములన్నియు పరమ ప్రయోజనదృష్టితో విలక్షణమగు ఆనుపూర్వీ వైశిష్ట్యముతో అమర్చబడినవి.

శ్రీ మత్స్యమహాపురాణ ప్రతిపాదిత విషయములు-

అధ్యాయక్రమమున :

1-10. సర్గ-ప్రతిసర్గ-వంశ-మన్వంతర వృత్తాంతములు 11-12. వంశానుచరితముగా సూర్యవంశ వర్ణనము 13-22. సూర్యునకును చంద్రునకును శ్రాద్ధ దేవత్వము వచ్చిన విధము తెలుపు ప్రసంగమున శ్రాద్ధకల్ప-పితృదేవతా చరిత ప్రతిపాదనము 23-50. వంశానుచరితము. చంద్రవంశ వర్ణనము 51. అగ్నివంశ వర్ణనము (శ్రౌతాగ్నుల ఉత్పత్తి వినియోగ వివరణము) 52-110. క్రియా యోగ ప్రతిపాదనము 111-122. భువనకోశ వ్యవస్థయందు-భూగోళసంస్థాన వర్ణనము 123-126. భువనకోశ వ్యవస్థయందు- ఖగోళ (జ్యోతిః) సంస్థానవర్ణనము 127-139 'త్రైపురము' అను దేవాసుర సంగ్రామమనబడు త్రిపరాసుర సంహార కథ 140. అమావాస్యాదులయందు పితరులకు తృప్తి కలుగు విధము 141-144. యుగపరిమాణ-యుగధర్మాది కథనము 145-159. తారకాసుర సంహార కథా ప్రతీపాదనము 160-162. నరసింహావతార వృత్తాంతము 163-170. పాద్మకల్ప సృష్టిక్రమ వృత్తాంతము 171-177. విష్ణుమహిమ ప్రతిపాదన రూపమగు కాలనేమి వధము (తారకామయ సంగ్రామము) 178. అంధకాసుర వధము 179-184. వారాణసీ మాహాత్మ్యము 185-193. నర్మదా మాహాత్మ్యము 194-201. గోత్రప్రవర వివరణము 202. ధర్మవంశ వివరణము 203. పితృగాథా 204. ఉభయతోముఖీ గోదానము 202. కృష్ణాజినదానము 206. వృషోత్సర్జన వృషభ లక్షణము 207-213. సావిత్ర్యుపాఖ్యానము 214-242. రాజధర్మములు 243-245. వామన చరితము 246-247. వరాహాపతార చరితము 248-250. అమృత మథనము 251-256. వాస్తుశాస్త్రము 257-269. క్రియాయోగ విధానమున దేవాలయాది నిర్మాణము-ప్రతిమాది లక్షణములు 270-272. భవిష్యద్రాజాను కీర్తనము 273.288. క్రియాయోగ విధానమున షోడశమహాదాన విధానము 289. కల్పనామాను కీర్తనము 290. శ్రీమత్స్యమహాపురాణ ప్రతిపాదిత విషయానుక్రమణి.

శ్రీమత్స్యమమాపురాణ విషయ ప్రతిపాదన ప్రణాళీ.

ఈ విధమున ప్రతిపాదింపబడిన విషయక్రమము మానవజీవన ప్రవృత్తికి ఏ విధముగ సహాయపడునో యోజింపవలసియున్నది.

ప్రపంచమంతయు అగ్నీషోమాత్మకము. ఇందు అగ్ని 'అత్త' అనగా తినువాడు; సమస్త సృష్టి యందలి సకల భోగ్య వస్తుజాలమును ఆయా జీవులు అనుభవించుటకు సాయపడు తత్త్వము 'అగ్ని' తత్త్వము; భోగ్యవస్తు సముదాయము అంతము 'సోమ' తత్త్వము; ఇది 'ఆద్యము' తినబడునది; అనుభవించబడునది.

1. 'అత్తా' 2. 'ఆద్యమ్‌' అను రెండు పదములును అద్‌ (అద-భక్షణ) అను ధాతువునుండి- 1. తృచ్‌- 2. ణ్యత్‌-ప్రత్యయములు చేరుటచే ఏర్పడినవి.

ఈ అగ్ని - సోమ-తత్త్వములు రెండును సంసారగతిని నిరంతర గతితో కొనసాగించుచు పోవుచుండును. దీని మూలమున 'ఆత్మ' 'జీవత్వము'ను అంది జననమరణ ప్రవాహమున కొట్టుకొని పోవుచుండును.

ఈ ప్రవాహగతిలో ఆతడు మాయాబద్ధుడై స్వార్థమునకు వశుడయి ప్రపంచ వ్యవహార నిర్వహణమునకై ఎన్నియో పనులు చేయుచుండును.

ఇందు కొన్ని పాపజనకములు; కొన్ని పుణ్య జనకములు; కొన్ని విహితములు; కొన్ని అవిహితములు; కొన్ని నిషిద్ధములు; ఇట్టివానిలో నిషిద్ధ కర్మాచరణమున కలుగు దోషమును పోగొట్టుకొనుటయు సాధ్యమయినంతవరకు అట్టి నిషిద్ధ కర్మములను ఆచరించకయే యుండుటయు మానవుని కర్తవ్యము.

అట్లు నజ్జీవనము జీవించుచు భగవత్తత్త్వము నెరిగి పర్యవసానమయున ప్రవృత్తి మార్గము నుండి నివృత్తి మార్గమునకు ఉన్ముఖుడై ముక్తిని సిద్ధింపజేసికొనుట మానవుల క ర్తవ్యము.

దానికై వలయు సకల సామగ్రిని ఈ శ్రీమత్స్యమహాపురాణము క్రమబద్దమగు ప్రణాళికతో అందజేయుచున్నది.

ఇట్లని స్పష్టముగ కనబడుచుండ నేటివారు కొందరు-మనవారు కూడ- ఈ పురాణ రచనములకు ఆర్వాచీనతను ఆనార్షతను అంట గట్టుటయు ఆయా చారిత్రక రాజవంశముల పాలన కాలమున లౌకిక ప్రయోజనములను దృష్టిలో నుంచుకొన ఎవరో రచించిరనియు లేదా తిరుగ వ్రాసిరనియు తమ అపరిపక్వ బుద్దివిలసిత ఫలముగా నిర్ణయించ బూనుట శోచనీయము.

దేవాసుర సంగ్రామములు

శ్రీ మత్స్యమహాపురాణమున 47వ అధ్యాయమున పేర్కొనబడిన దేవాసుర సంగ్రామములు మొత్తము పండ్రెండు. ఇందు:

1. మొదటిదగు 'నారసింహము' 160-161-162 అధ్యాయములందు ప్రతిపాదింపబడినది.

2. రెండవది 'వామనము' ఇది 213-244-245 అధ్యాయములందు తెలుపబడినది.

3. మూడవది 'వారాహము'; ఈ దేవాసుర సంగ్రామము 246-247వ అధ్యాయములందు నిరూపింపబడినది.

4. నాలుగవది 'అమృత మంథనము'; ఇది 248-249-250- ఈ అధ్యాయములందు ఉపవర్ణింపబడినది.

5. ఐదవది 'తారకామయము' అను దేవాసుర సంగ్రామము; ఇది 171-172-173-174-175-176-177 అధ్యాయముల యందు వివరింపబడినది.

6. ఆరవది -ఆడీ బక(వధ)ము' అను దేవాసుర సంగ్రామము; ఇది 155వ ఆధ్యాయమున తెలుపబడినది; ఈ సంగ్రామమున జరిగినట్లు తెలుపబడిన మరికొన్ని సంఘటనము లీ యధ్యాయమున ఆడి వధ సందర్భములో ప్రతిపాదింప బడలేదు. ఇది ఇంకను పరిశీలింపవలసిన విషయము.

7. ఏడవది 'త్రైపురము' 'త్రిపురాసుర సంహారము' అను దేవాసుర సంగ్రామము; ఇది 127వ అధ్యాయము మొదలు 139వ అధ్యాయమువరకు విస్తృతముగా వర్ణింపబడినది.

8. ఎనిమిదవది 'అంధకాసురవధము' అను దేవాసుర సంగ్రామము; ఇది 178వ అధ్యాయమున నిరూపంప బడినది.

9. తొమ్మిదవది 'వృత్రవధము' అను సంగ్రామము; ఇది శ్రీమత్స్యమహాపురాణమున వర్ణింపబడలేదు.

10. పదియవది 'ధాత్రము'; ఇదియు ఇందు ప్రతిపాదింపబడలేదు.

11. పదునొకొండవది 'హాలాహలము' అను దేవాసురసంగ్రామము! ఇది అమృతమంథన సమయమున ఉద్భవించిన హాలాహలము కారణముగా జరిగిన దేవదానవనాశ రూపమయినదో మరి ఏదో తెలియదు.

12. పండ్రెండవది 'కోలాహలము' అను దేవాసుర సంగ్రామము; ఇది ఈ మత్స్యమహాపురాణపు నలువది ఏడవ అధ్యాయమునందే వివరింపబడినది.

ఇందు ప్రతిపాదింపబడిన దేవాసుర సంగ్రామములు సృష్టి పరిణామక్రమములో జరిగిన అనేకములగు దశలను పరోక్షమగు విధానమున చెప్పుచున్నవి.

కాలనేమియను అసురుని కథ ఇట్టివానికి ప్రధానోదాహరణము.

అంధకుని చంపుటకుపూని ఘోర రూపముదాల్చిన పరమేశ్వరుని చెమట నుండి వాస్తు పురుషుడు జన్మించెనట; (251 అ.) ఇదియేమి పిచ్చి కథ!

ఇందలి యాథార్థ్యము వాస్తు పురుషుని దేహావయవములపై ఎక్కి కూర్చుండిరని చెప్పబడిన దేవతలు ఎవరెవరో చూచినచో స్పష్టమగును.

అంధకుడు ఆయా ఋతువులందు చెలరేగు సవాతవృష్టులకు (గాలివానలకు) ప్రతీకము; ఆయా సమయములందు వృష్టులను కలిగించుటకును కలిగించకపోవుటకును అతివృష్ట్యనావృష్టులకును హేతువులగు పవనముల (Monsoons) ప్రవృత్తియే ఈ 'అంధక' దానవుడు; 'అంధ' శబ్దముతో సంబంధము కలదియే ఆంధికా- ఆంధీ(తుఫాను); వృష్టితో పాటుగనే ఈ అంధకముల విజృంభణమునకుకూడ ఈ వర్షప్రద పవనములే కారణము గదా! ఇది ఈశాన్యము నుండి నైరృతమునకో నైరృతమునుండి ఈశాన్యమునకో వీచుచుండును. వీని ప్రపృత్తులవలన కలుగు వర్షములవలన మానవ జీవనము చక్కగ కొనసాగును. కాని వీని ఆస్తవ్యస్త ప్రవృత్తిచే కలుగు ఈ అంధకములవలన మానవ జీవన ప్రవృత్తికి ఎన్నియో హానులును కలవు కదా. వీని నుండి రక్షించుకొనుటకు తగిన గృహములను మానవులు నిర్మించుకొనవలయును. ఆ విషయము దృష్టి యందుంచుకొనియే చతుష్షష్టి పదవాస్తునందుకాని ఏకాశీతి పదవాస్తునందుకాని వాస్తు పురుషుని దేహము-వాని శిరస్సు ఈశాన్యమునకును పాదము నైరృతమునకును నున్నట్లు భావన చేయవలెనని చెప్పబడినది.

ఈ వాస్తు పురుషుని అవయవములను త్రొక్కి పట్టిన దేవతల నామములుకూడ- పాప-రోగ-శోష-మొదలగున వన్నియు ఈ విషయమునే సూచించుచున్నవి.

ఏ దేవతల స్థానమున ద్వారములుండవలయును ? ఏ దేవతల స్థానమున ద్వారములుండరాదు ? అను నిర్ణయము కూడ ఈ యంశమునే స్పష్టము చేయుచున్నది.

వాస్తు యంత్రమున ఉన్నట్లు చెప్పబడిన దేవతలు అందరును ఏమి? అనునది వారివారి నామముల రూపనిష్పత్తిని బట్టి కలుగు అర్థములు పరిశీలించినచో స్పష్టమగును.

అది యంతయు సమగ్రముగ ఇట్లు వివరించుచుపోయినచో గ్రంథ విస్తరమగును. ఏమయినను 'అంధకాసుర వధము' మన పూర్వులు వానగాలులు-గాలివానలు-వంటి ప్రకృత్యుపద్రవములపై అదుపు సంపాదించుటకు చేసిన యత్నమును తెలుపును. వాస్తూత్పత్తి కథలోని ఆంతరార్థమును ఇప్పటికే తెలిసికొనియున్నాము.

ఏమయినను దేవాసుర సంగ్రామముల యందలి ఆంతర్యమును పరిశీలనాత్మకముగ యోజించవలయును. దానిచే సత్యము తెలియును. వృత్రవధ తత్త్వదికమును శ్రీమాన్‌ ఎక్కిరాల కృష్ణమాచార్యులు మొదలగువారు సవివేచ నముగ తెలుగువారికి అందించినారు. స్వర్గనరకాదికమును గూర్చియు వారు చెప్పిన యంశములు సయుక్తికములు శాస్త్రియ ములనై ప్రామాణికములుగా స్వీకార్యములు.

ఆ మార్గమున ఇంకను ఆలోచించగలిగినచో మరింత మేలు.

ఈమాత్స్యమందు ఈయబడిన స్తోత్రాదికము :

1. దక్షునకు శ్రీదేవి చెప్పిన స్వీయాష్టోత్తర శత స్థాన నామములు-13 అ.

2. శుక్రకృత శివస్తుతి-47 అ.

3. దేవతాకృత శివస్తుతి-130 అ.

4. వీరకకృత దేవీస్తుతి-157 అ.

5. భృగుకృతా శివస్తుతిః-192 అ.

6. సావిత్రీకృతా యమస్తుతిః-211 అ.

7. బ్రహ్మకృతా వామనస్తుతిః-244 అ.

8. దేవదానవకృతా విష్ణుస్తుతిః-248 అ.

9. దేవదానవకృతా శంకరస్తుతిః-248 అ.

10. మృత్యుజయకరములగు ఉగ్రాయుధ జనమేజయ వృత్తాంత శ్లోకములు-49 అ.

11. అంధకవధే శై వనారసింహమాతృకోత్పత్తిః-178 అ.

12. అదితికృతా విష్ణు స్తుతిః-వామనావతారే-243 అ.

13. భూదేవీకృతా విష్ణుస్తుతిః-వరాహావతార కథాయామ్‌-247 అ.

14. దేవతలు చేసిన బ్రహ్మస్తుతి-153 అ.

15. రతిదేవి చేసిన బ్రహ్మస్తుతి-153 అ.

16. దేవతలు చేసిన కుమార స్తుతి-158 అ.

ప్రకృతి వికృతి హోమవ్రతాదులు-శ్రౌత సంప్రదాయమున యాగములు.

ప్రకృతి యాగములు వికృతి యాగములు అని యాగములు రెండు విధములు. అన్ని యంశములను సమగ్రముగాను సరళముగాను ఉండు యాగములు ప్రకృతి యాగములు. ఈ ప్రకృతి యాగములకు గల ప్రక్రియా మంత్రోపకరణాదికమున కొలది మార్పులు చేర్పులు చేయుటతో నిర్వహింపబడు యాగములు వికృతి యాగములు. అట్లే ఈ మత్స్యపురాణమందును శాంతి విధానములు వ్రతములు మొదలగు వాని ప్రక్రియలును ఈ రెండు విధములుగానున్నవి.

ఉదా : అయుత హోమము ప్రకృతి హోమము-లక్షహోమ-కోటి హోమములు వికృతి హోమములు.

వ్రతములందును ఇట్టి పద్ధతి కలదు. పర్వత దాన-గుడాది ధేను దాను వ్రతములయందును ఇట్లు ప్రకృతి వికృతి ప్రక్రియ గోచరించును. ఇది ఈ పురాణ రచన మీమాంసా శాస్త్ర సంప్రదాయానుసారముగ జరిగెనని చెప్పుటకు ప్రమాణము.

కుండ-మండప-వేది-యోని ప్రభృతి హవనాంగముల లక్షణము విషయమునకూడ కమలాకర భట్టాది నిబంధకారులందరును ఈ శ్రీ మత్స్యమహాపురాణ వచనములనే తమ నిబంధములందు ప్రమాణములుగా గ్రహించి ఉదాహరించియున్నారు.

ఇందు ప్రతిపాదించిన ఏవిషముగాని అస్పష్టతకు ఏమాత్రము అవకాశములేనిదై సుస్పష్టముగ విషయమును అవగతము చేయుచుండుట ఈ మహాపురాణమునందలి విశిష్టత.

పురోడాశః-చరుః.

చరుః-హవ్యపాకే చరుః పుమాన్‌-అమరః; కాం. 2. బ్రహ్మ-2 శ్లో.

'అనవస్రావితాంతరూష్మపాక ఓదన శ్చరుః. ఇతి యాజ్ఞికాః. మీమాంసకైరపి త్రివృచ్చర్వధికరణ ( ) అన్న పరత్వం చరు శబ్దస్యాభ్యుపగతమ్‌; ఉగవాదిభ్యో యత్‌. (పా5-1-2) ఇతి సూత్రే కైయటస్తు స్థాలీవాచీ చరు శబ్దః- తాత్థ్స్యా దోదనే భాక్తః ఇత్యాహ;' అత్తెసరు పెట్టి-లోని ఆవిరి బయటికి పోకుండ వండిన అన్నము.

పురోడాశః- (Apte) A Sacrificial oblation made of ground rice and offered in Kapalas.

ఈ మత్స్యపురాణమునందు మరియొక విశేషము కలదు: మన వాఙ్మయమునందలి అనేక కథలును దేవతా స్తుతిరూప రచనలందలి విషయములును దేవతా నామములును రహస్యార్థగర్భితములు. ఆ కథలును సంఘటనలును పదములును ఇచ్చు బాహ్యార్థము ఒకటి కాగా దానిచే ఎరుగవలసిన తాత్త్వికార్థము మరియొకటిగా నుండుటయే వీనియందలి విశిష్టత.

'బ్రహ్మ' తాను గాయ్రతిని (సరస్వతిని) సృజించెను. అట్లు తన పుత్త్రియగు ఆమెతో సంగమించెను. ఇది సముచితమా? అని ప్రశ్న కలుగును దీనియందలి తాత్త్వికార్థమును కూడ ఇచట పురాణమే చెప్పుచున్నది. ఇట్లే ఈ పురాణమునందు ఎన్నియో ఇషయముల వెనుక తాత్త్వికార్థములు కలవు. వాని నన్నిటిని ఇట్లే విచారించుకొని తెలిసికొనవలయునని ఈ పురాణము గాయత్రీ బ్రహ్మ సంగమ విషయమున ఇచ్చిన వివరణముతో మనకు సూచించు చున్నది.

బ్రహ్మకు ఐదు ముఖములు ఉండుట- అవి ఒక్కొక్కటి ఒక్కొక్క భంగిలో ఉండుట- మొదలగునవి ఇటువంటివే.

ఇటువంటివి మన ఆర్ష వాఙ్మయమున ఎన్నియో కలవు. వానిని ఉపాసనముగా గ్రహించి విషయములను సరిగా అవగాహన చేసికొని తత్ర్పయోజనము పొందుట జన్మ సాఫల్య హేతువు. కాని మన ఆర్ష వాఙ్మయమును - వైదిక వాఙ్మయమును- సంప్రదాయమును బట్టి అవగాహనము చేసికొని జిజ్ఞాసువుల కొఱకు వ్యాఖ్యానించు పెద్దలు లభించుట దుస్సాధమయిన కాలమిది. సత్యపు యథార్థ సమన్వయమే తన రూపముగా సత్య స్వరూపుడయిన నారాయణుడు సద్గుర్వనుగ్రహ వైదిక శ్రద్ధామాత్ర సాధ్యుడయి గురు పరంపరలో అనుస్యూతముగా నిలిచియుండును. అట్టి సత్య సమన్వయ సంప్రదాయమే అనాదినుండి మన ఆర్షవాఙ్మయరూపము ఇది వైదిక వాఙ్మయపు యథార్థ తత్త్వమును తన యందు భద్రముగా పదిలపరచి యుంచికొనినది. అట్టి సంప్రదాయమును సంపూర్ణముగా గ్రహింపక-అనుసరింపక-ఎంతటి విషయమును ఎంతగా గ్రహించినను ఎన్ని శాస్త్రములను అధ్యయనము చేసినను ఎంతటి యేధాబల విన్యాసముల సాధించినను సున్నితమయిన ఆర్ష వైదిక సత్యమును దాని వాస్తవ రూపములో కోమలముగా గ్రహిరిచి పొదివి పట్టు కొనుట సాధ్యపడదు.

పాశ్చాత్త్య దృక్పథముల తీవ్ర మరుత్ప్రవాహములలో ఆలోచనలు కొట్టుకొనిపోవుచుండగా అందని సంప్రదాయమును అందుకొన శ్రమింపజాలకము వివిధ హేతువులచే తమకు సాంప్రదాయిక విషయములయం దభినివేశము అభిమానము ఉండుటచే ఆర్ష వైదిక వాఙ్మయపు తత్త్వమును వ్యాఖ్యానించుటకు ఇట్లెందఱో భారతీయ మేధావులు ప్రయత్నించుచున్నారు. వీరి సంప్రదాయాభిమానము అభినందనీయమే. కాని ఇట్టి వారు చేయు మేధాబల విన్యాసముల వలన సత్యనారాయణునికి జరుగు ద్రోమమును వీరు గ్రహించుట అత్యావశ్యకము.

''బిభే త్యల్పశ్రుతా ధ్వేదో మా మయం ప్రహరే దితి |

ఇతిహాస పురాణాభ్యాం వేదా న్త్సముపబృంహయేత్‌.''

''ఇతిహాస పురాణములను సరిగా అధ్యయనము చేయక అల్పముగా శాస్త్రాధ్యయనము చేసిన వాని వలన నుండి 'ఈతడు నన్ను దెబ్బ కొట్టునేమో!' ('శ్రుతి'కి అనుచితములగు అర్థములను కల్పించునేమో!') అని వేదము భయపడును.''

పాశ్చాత్త్య విజ్ఞానము ప్రాపంచిక వాస్తవములను చూచు దృష్టి- దాని తార్కిక భూమిక (Premise) దాని మార్గము-వేరు; మన సంప్రదాయ విషయములకు వలయు దృష్టి-తార్కిక భూమిక-విచారణ మార్గము-వేరు. వీటిని త్వరపడి వేళవింప యత్నించుటలో సత్యమున కెంతయో ప్రమాదము వాటిల్లును.

శ్రీమత్స్య మహాపురాణమునందలి మరికొన్ని వైలక్షణ్యములు :

1. ఇందలి భాష చాల ప్రాచీనము. శబ్దరూపములు పాణినీయ వ్యాకరణము వలన లభించు లక్షణములకు అతీతములగునవి కొన్ని కలవు; ఛందోభంగమును లెక్క పెట్టని కూర్పు చాల తావులందు కనబడును.

2. శైలి సరసము-సరళము-మధురము - చిన్న చిన్న పదములతో వాక్యములు కూర్చబడి వానిచే అధిక విషయము అత్యంత స్పష్టముగా ప్రతిపాదింపబడును. కూర్పులో శిథిలత ఎచ్చటను కానరాదు.

3. సంధి వైలక్షణ్యము. ''యదేనా మాత్మనోదీర్ణాం తనయాం సముపేక్షసే.'' (వృషపర్వాణం ప్రతి శుక్రన్య వచనమ్‌).

ఇచట 'ఆత్మనః+ఉదీర్ణాం>ఆత్మన+ఉదీర్ణాం>ఆత్మనోదీర్ణామ్‌' అంతేకాని- 'ఆత్మనా+ఉదీర్ణాం' అని ఉద్దిష్టము కాదు; యతః+ఉత్పాతాః>యతోత్సాతాః (120 అ; 36 శ్లో.)

వీనికి ఇంకను ఉదాహరణములు విజ్ఞులు విశ్లేషణాత్మక దృష్టతో ఆయా యెడల తామే గ్రహించ యత్నింతురు గాక.

4. సమాన వై లక్షణ్యము.

5. కారక వైలక్షణ్యము.

6. వాక్యాంతర్గత వాక్యములు.

7. ఆర్షరూపములు - 'భరథః' మొదలగువి; గృహ్య(గృహీత్వా)

8. విలక్షణములగు అర్థములందు ప్రయోగించడిన పదములు: సృష్టం-భవ్యం-'సరస్వతి' అను అర్ధమున 'యా రూపార్థవతీ పత్నీ బ్రాహ్మణః' (170అ.) మొదలగునవి. వీనిలో కొన్ని వివరణములలో ఈయబడినవి.

9. తెలుగు పదములే సంస్కృతమునకు చేరెనేమో అనుకొనదగిన ప్రయోగములుః శాఖా=చెక్క (తలుపు చెక్కలు అను అర్థములో); కటి =గడియ- ఈ మొదలగునవి.

10. పాణీనీయ వ్యాకరణమునందలి పారిభాషిక పదమునకు అర్థమును సరిగా గ్రహించుటకు స్పోరకముగా ఉపయోగించు 'పురుష'పద ప్రయోగము.

11. విలక్షణముగు నిర్వచనములు: ఉషా-వ్యుషా-ఉష-కుహూ-'యమ' పర్యాయ పదములు మొదలగునవి.

12. ఛందోభంగకరములగు శబ్ద ప్రయోగములు: 'వేధసాం పత్యే (130ల. 24శ్లో) అని అనుష్టుప్‌ శ్లోకపు సమపాదాంతమున ప్రయోగము 'వేధసాం పతే' అనినచో అర్థము సరిపోదు; ఛందస్సునకు సరిపోవును. ఇట్టివి ఇంకను చాల గలవు. అయినను వీనిని ఆర్షరూపములుగా ఆర్షమగు ఛందోభంగానుమతి గా గ్రహించి యథాతథ రూపమును గ్రహించుట జరిగినది.

ఇట్టి వైలక్షణ్యములు ఇంకను కలవు. వానని అచ్చటచ్చట సూచించుట జరిగినది. మిగిలిన వానిని విజ్ఞులు ఊహించుకొనగలరు. ఇవి అన్నియు సంస్కృత మూలమును చదివి అవగాహనము చేసికొనువారిని దృష్టిలో ఉంచుకొని చెప్పుట.

ఇందు పూర్వ మీమాంసా - వైశేషిక దర్శన తత్త్వములు ఆయా సందర్భములలో చాల సుకుమారముగా పాటింపబడినవి. సృష్ఠి ప్రక్రియలను నిరూపించు సందర్భములలో వైశేషిక దర్శన తత్త్వములును సంప్రదాయములును-ధర్మశాస్త్ర విషయములను పూజా హోమాది ప్రక్రియలను నిరుపించునపుడు పూర్వ మీమాంసాశాస్త్ర సంప్రదాయములును గోచరించుచుండును.

40వ అధ్యాయమునందు ''ఈ లోకమునందు శ్రాద్ధకర్తలు తమ పితరులను ఉద్దేశించి జరపిన శ్రాద్దములు ఉద్దిష్టులగు పితరులకు ఆ శ్రాద్ద మంత్రములే అందజేయును.'' అనుటకు సమర్థకముగా '' యథా గోషు ప్రతిష్ఠాసు (ప్రణష్టాసు)వత్సో విందతి మాతరమ్‌''. 78శ్లో.

''తప్పిపోయిన తన తల్లిని అనేక ధేనువుల నడుమ ఎచ్చట నున్నను గోవత్సము గురుతించినట్లు''. అని చెప్పబడినది.

ఇది ''ప్రణష్టమాతృ-గొవత్సన్యాయము'' అను మీమాంసకుల లౌకిక న్యాయము అనవచ్చును.

143వ అధ్యాయమున ''పాపిష్ఠమగు కలియుగమునుండి ధర్మమయమగు కృతయుగ మవతరించును.'' అనుటను సమర్థిచుటకై 96-97 శ్లోకములలో

''యథా దావ ప్రదద్దేషు తృణష్వేవాపరం తృణమ్‌|

వనానాం ప్రథమం వృష్ఠ్యా తేషాం మూలేషు సంభవః.''

''దావాగ్నిచే దగ్ధములయిన వనగత తృణ మూలములందుండియే దవాగ్నికి తరువాత కురిసిన మొదటి వానతో మరల వాని మొలకలు లేచినట్లు''.

అనుచు ''దావదగ్ధ తృణప్రరోహ న్యాయము'' అను మీమాంసకుల లౌకిక న్యాయము అనదగినది ఈయబడినది.

144 అధ్యాయమున సత్యము మొదలుగువాని లక్షణములు చాల నిక్కచ్చిగా శాస్త్రీయముగా అన్యూనానతిరిక్తముగా (అవ్యాప్తి-అతివ్యాప్తి-అసంభము- అను లక్షణ దోషములు రాకుండ) చెప్పబడినవి.

ఈ అధ్యాయమునందే ''అవ్యక్తాది విశేషాంతే వికారే'' అని చెప్పబడినది.

వైయాకరణాదులు చెప్పిన 'ద్రవ్య-గుణ-కర్మ-సామాన్యములను మాత్రమే కాక 'విశేషము' అను దానిని కూడ 'పదమునకు అర్ధముగా' చెప్పిన కణాదమతమును ఇచట స్మరించుకొనవచ్చును.

ఇట్లు ఈ పురాణమున మీమాంసా వైశేషికాదిశాస్త్ర సంప్రదాయములు పలుతావుల కనబడును.

ఈ అనువాదమునకై ప్రధానముగా గ్రహించిన మూలప్రతి క్రీ.శ. 1877లో శ్రీ పువ్వాడ వేంకటరావుగారు ముద్రించిన తెలుగుప్రతి. ఇందు ముద్రణ దోషములు అధికముగా ఉన్నవి. ఐనను దీనియందు ఉన్న పాఠములు చాలవరకు ప్రామాణికముగా గ్రహింపదగినవి. ఇదికాక 'నందలాల్‌-మోర్‌' సంపాదకత్వములో ముద్రితమయిన నాగరీ లిపి ప్రతియు 'శ్రీచామ రాజేంద్ర గ్రంథమాల'లో కన్నడానువాదముతో కన్నడ లిపిలో ముద్రించబడిన ప్రతియు సంప్రతించుట జరిగినవి. కాని ఈ రెండింటిలోను పాఠ సౌష్ఠవము విషయమున కన్నడ ప్రతి కొంత మేలు.

శ్రీ పువ్వాడ వారి ప్రతిలో ముద్రణమున పదములకు నడుమ వ్యవధానము (Spacing) ఏ మాత్రమును లేని దండాయమాన ముద్రణము. పైగా దీని మూలప్రతి నాగరీలిపి ప్రతియనియు దానినుండి తెలుగు వ్రాసికొనుటలో లేఖన దోషములు చాల దొరలినవనియు తోచు తావులు చాల కలవు. ఉదాహరణమునకు-తయోక్తం ('తథోక్తం' అనుటకు) 'ఖసృపః' (స్వసృపః- అనుటకు) దుఃఖగాహం ('దురవగాహం' అనుటకు) మొదలగునవి.

ఇట్టివి యథాశక్తిగా గమనించి సరిచేయుట జరిగినది.

అప్పటికిని చాల క్లిష్టమయిన తావులు ఎన్నియో వచ్చినవి. ఉన్న పాఠము అన్వయమునకు రాదు; అట్టి చోట్ల సముచితమని తోచిన అక్షరమును - అక్షర సముదాయమును బ్రాకెట్‌లో ఇచ్చుట జరిగినది.

ప్రాచీన భారతీయ వాజ్మయమును చదువుటకు ఆవశ్యకములగు ప్రాధమికాంశములును విశేష జిజ్ఞాషాపాత్రములగు మరికొన్ని ఆవశ్యకాంశములును జిజ్ఞాసువుల ఉపయోగమునకై ఇక మీదట ఈయబడుచున్నవి.

ఇవి కాక మరికొన్ని విషయములు ఎక్కడి కక్కడ అనువాదముతో పాటే ప్రధాన విషయమునందో Foot Notes గానో ఇచ్చుటయు జరిగినది.

అవి అన్నియు పురాణ ప్రతిపాదిత విషయమును సరిగా అవగాహనము చేసికొనుటకు సహాయకమగునని ఆశ.

శ్రీ సద్గురువుల కృపతో జరిగిన ఈ చిన్న పని జిజ్ఞాసువులగు పఠితలకు సరిగా ఉపయోగపడుటయే ఈ అను వాదకునకు మిగులు వాస్తవ ఫలము.

ఏ రచనైనను ప్రశంసించదలచినను అభిశంసించదలచినను మొదటి దాని యందు ప్రతిపాదితమయిన విషయపు వాస్తవ స్వరూపమును తెలిసికొనుట ఆవశ్యకము. అందలకే ఈ ప్రయత్నము అంతయును.

విజ్ఞులు ఇందలి గుణములు మాత్రము గ్రహించి దోషములను మన్నింతురు గాక!

- అనువాదకుడు.

Sri Matsya Mahapuranam-1    Chapters